Tuesday, March 29, 2016

ఆలోచించవోయి దేశ భక్తా.......

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే
దేశ భక్తా
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా దేశభక్తా ?
*
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశ భక్తా ?
*
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ దేశ భక్తా ?
*
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా దేశ భక్తా ?
*
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా దేశ భక్తా ?
*
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా దేశ భక్తా?
*
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా దేశ భక్తా?
*
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా దేశభక్తా ?
*
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా దేశ భక్తా?
*
అసలు ,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా దేశభక్తా ?
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ ,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను చూసావా దేశభక్తా?
*
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
ఎవరు ఎలా రైతులను మోసం చేస్తున్నారో తెలియకుండా ఉంటుందా
దేశ భక్తా?
*
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పోలాలకు తీసుకెళ్ళి చెప్పావా దేశ భక్తా ?
*
క్రికేటర్లు
బూస్టులో కూల్ డ్రింకు లో తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా దేశభక్తా?
*
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కోపోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు చూసావా దేశ భక్తా ?
*
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా దేశ భక్తా !
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
*
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం దేశ భక్తా?
*
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు దేశ భక్తా.
*
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో దేశ భక్త .
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి ,
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

Thursday, March 24, 2016

Tips to follow in Summer

వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.

రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--

1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.

4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.

5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.

6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.

7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.

8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.

9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.

10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.

11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.

12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.

13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.

15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి

16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.

17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.

18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.

19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.....................

Clarity makes difference

ఒకసారి అమరావతిలో బుద్దుడి విగ్రహాన్ని చెక్కిన శిల్పిని అడిగారంట ప్రజలు .అంత అందమైన శిల్పాన్ని ఎలా చెక్కారు ? అని .ఆ శిల్పి "ఏమి లేదు అనవసరమైనవి అన్నీ తీసేసాను ! అవసరమైనవి అన్నీ ఉంచాను ,ఆద్భుతమైన బుద్దుని విగ్రహం వచ్చింది "అని చెప్పాడు.

ఆ శిల్పికి ఏది ఉంచాలో ,ఏది తీసివేయాలో స్పష్టత ఉంది .అందుకే అంత సుందరమైన బుద్ధుని విగ్రహం వచ్చింది. మనకు మన జీవితంలో ఏది చేయాలో,  ఏది చేయ కూడదో స్పష్టత ఉంటే జీవితం బ్రహ్మానందమయం.

భక్య్తోపనిషత్

భక్తి చాలా గొప్పది
మన శరీర ఆరోగ్యం పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
మన మనోరంజనం పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
మన బుద్ధివికాసం పట్ల మనం భక్తిని కలిగివుండాలి
మన నిరంతర ధ్యానాభ్యాసం పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
మన ఆత్మానుభావాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
మన వర్తమాన ఎరుక పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
యమ నియమాదులన్నింటి పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
మన రోజువారి దైనందిన కార్యక్రమాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
చిన్నారుల పట్ల, పసిపాపల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
సకల విద్యల పట్ల, సకల కళల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
స్వీయాత్మ యొక్క అనంత సామర్థ్యాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
స్వీయాత్మ యొక్క అనంతశక్తుల పట్ల మనం బక్తిని కలిగి వుండాలి
సృష్టి యొక్క అద్భుత రచన పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
విశ్వంలో వున్న యోగీశ్వరులందరి పట్ల మనం బక్తిని కలిగి వుండాలి
తోటి మానవుల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
అందరి ఆరోగ్యాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
అందరి మనోరంజన, బుద్ధివికాసాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
సకల పశుక్ష్యాదుల పట్ల మనం భక్తిని కలిగి వుండాలి
సకల జంతుసామ్రాజ్యం యొక్క రక్షణ, పోషణలపట్ల భక్తిని కలిగి వుండాలి
భూ ప్రకృతి సమస్తం పట్ల భక్తిభావన కలిగి వుండాలి
వాతావరణాన్ని కలుషితం చేయరాదు
వాతావరణ సహజస్థితులను పరిక్షించుకుంటూ వుండాలి
ఇతి భక్తి యోగః! ఇతి భక్తి సిద్ధాంతః
భక్తి చాలా గొప్పది మహాభక్తిని కలిగి వుందాం...

How to strengthen your relationships?

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.
స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!. ఆలోచించండి ..........

వికృతాలకు విరుగుడు

"కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనినః కలహో నాస్తి న భయంచాస్తి జాగ్రతః."

"కృషితో - కరువూ, జపంతో - పాపమూ, మౌనులకు - కలహమూ, మేల్కొని ఉన్నవారికి - భయమూ ఉండవు" అని ఈ శ్లోకభావం.

         కృషి అంటే - సేద్యం (పంటలు పండించటం) అనీ, శ్రమపడి పట్టుదలతో పనిచేయటమనీ కూడా అర్థం చెప్తాము. దుర్భిక్షం అంటే కరువు. పంటలు పండిస్తే కరువుకాటకాలు ఉండవనేది సత్యం. అలాగే – పట్టుదలతో పని చేస్తే ఏరంగంలోనూ లోటు ఉండదు. కృషి ఉంటే సమస్తదుర్భిక్షాలు తొలగుతాయి.

         జపం, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనల వల్ల పాపం ఉండదు. దైవసంబంధమైన అర్చనకు ముందుగా "సర్వాషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే" (ఎవరితోనూ విరోధబావం లేకుండా ఈ బ్రహ్మకర్మ ప్రారంభిస్తున్నాను) అని ప్రతిజ్ఞ చేస్తారు. ఏ ఒక్కరియందు విరోధభావం మనస్సులో ఉన్నా జపం చేసే అర్హత ఉండదు. అంత పవిత్ర భావనతో జపం చేస్తే ఇక పాపానికి తావెక్కడ?

         మౌనం చాలా శక్తివంతమైనది. ఏ గొప్ప ప్రణాళికకైనా, పరిశోధనకైనా మౌనమే ఆవిర్భావ వేదిక. మిత భాషణాన్ని కూడా మౌనంగా నే పరిగణించవచ్చు. "సత్యాయ మితభాషాణామ్" (సత్యంకోసం మితంగా మాట్లాడేవారు) అన్నాడు కాళిదాసు. మితిలేని సంభాషణవల్ల అసత్యాలు పలికే అవకాశాలు, కలహాలకు దారితీసే వితండవాదాలు అధికంగాఉంటాయి. అయితే, సర్వత్రా మౌనాన్ని వహించటమూ భావ్యంకాదు. కొన్ని సందర్భాల్లో మౌనం నిందాస్పదమౌతుంది. మూర్ఖులు నిర్హేతుకంగా కలహానికి సిద్ధపడుతున్నారని గ్రహించిన వెంటనే విజ్ఞుడు మౌనాన్ని ఆశ్రయించటం శ్రేయస్కరం.

         భయానికి అజ్ఞానమే మూలం. జ్ఞాన సంపన్నులు దేనికీ భయపడరు – "క్షణం విత్తం క్షణంచిత్తం క్షణం జీవిత మావయోః, యమస్యకరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత" (మన విత్తము,చిత్తము,జీవితము క్షణమాత్రమే. యమునికి దయ లేదు. అందువల్ల జాగ్రత్త) ఇది కేవలం ఆధ్యాత్మిక విషయంకాదు. సంఘసంక్షేమానికి కూడా మేలు చేకూర్చే దృక్పథం. "క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప" అనే గీతావాక్య ప్రేరణతో వివేకానందస్వామి చెప్పిన "Be fearless" అనే నినాదం అందరినీ జాగృతులను చేస్తుంది.

Spiritual quotes


  • నీకు కష్టం, నష్టం కలిగించేవి అందరికీ పంచకు...నీకు ఆనందాన్ని అందించేవాటినే అందరికీ పంచు.
  • భౌతికవాదంతో సుఖం ఉంటుంది. ఆధ్యాత్మికవాదంతో ఆనందం ఉంటుంది.
  • కులం ముఖ్యం కాదు...గుణం ముఖ్యం.
  • మతం ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం
  • మఙచి మిత్రుడి మాట చేదుగా ఉంటుంది. చెడ్డ మిత్రుడి మాట తియ్యగా ఉంటుంది.
  • మూర్ఖులతో వాదించడం  అంటే మన శక్తిని వృధా చేసుకోవడమే..
  • చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా ...చిరుదీపాన్ని వెలిగించుకోవడం మిన్న...
  • గదులు విశాలంగా ఉండడం కాదు..మనసులు విశాలంగా ఉండాలి.
  • ప్రకృతిలో నీవు ఎటువంటి ఆలోచనలు విడుదల చేస్తావో అవే నీకు ఫలితాలుగా మారుతాయి.
  • సగం తెలుసుకొని సందేహించకు...సంపూర్ణంగా తెలుసుకొని సంతృప్తి చెందు...
  • దారితప్పితే కొంతే ప్రమాదం..నీతి తప్పితే అంతా ప్రమాదమే..⁠⁠