Thursday, March 24, 2016

వికృతాలకు విరుగుడు

"కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనినః కలహో నాస్తి న భయంచాస్తి జాగ్రతః."

"కృషితో - కరువూ, జపంతో - పాపమూ, మౌనులకు - కలహమూ, మేల్కొని ఉన్నవారికి - భయమూ ఉండవు" అని ఈ శ్లోకభావం.

         కృషి అంటే - సేద్యం (పంటలు పండించటం) అనీ, శ్రమపడి పట్టుదలతో పనిచేయటమనీ కూడా అర్థం చెప్తాము. దుర్భిక్షం అంటే కరువు. పంటలు పండిస్తే కరువుకాటకాలు ఉండవనేది సత్యం. అలాగే – పట్టుదలతో పని చేస్తే ఏరంగంలోనూ లోటు ఉండదు. కృషి ఉంటే సమస్తదుర్భిక్షాలు తొలగుతాయి.

         జపం, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనల వల్ల పాపం ఉండదు. దైవసంబంధమైన అర్చనకు ముందుగా "సర్వాషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే" (ఎవరితోనూ విరోధబావం లేకుండా ఈ బ్రహ్మకర్మ ప్రారంభిస్తున్నాను) అని ప్రతిజ్ఞ చేస్తారు. ఏ ఒక్కరియందు విరోధభావం మనస్సులో ఉన్నా జపం చేసే అర్హత ఉండదు. అంత పవిత్ర భావనతో జపం చేస్తే ఇక పాపానికి తావెక్కడ?

         మౌనం చాలా శక్తివంతమైనది. ఏ గొప్ప ప్రణాళికకైనా, పరిశోధనకైనా మౌనమే ఆవిర్భావ వేదిక. మిత భాషణాన్ని కూడా మౌనంగా నే పరిగణించవచ్చు. "సత్యాయ మితభాషాణామ్" (సత్యంకోసం మితంగా మాట్లాడేవారు) అన్నాడు కాళిదాసు. మితిలేని సంభాషణవల్ల అసత్యాలు పలికే అవకాశాలు, కలహాలకు దారితీసే వితండవాదాలు అధికంగాఉంటాయి. అయితే, సర్వత్రా మౌనాన్ని వహించటమూ భావ్యంకాదు. కొన్ని సందర్భాల్లో మౌనం నిందాస్పదమౌతుంది. మూర్ఖులు నిర్హేతుకంగా కలహానికి సిద్ధపడుతున్నారని గ్రహించిన వెంటనే విజ్ఞుడు మౌనాన్ని ఆశ్రయించటం శ్రేయస్కరం.

         భయానికి అజ్ఞానమే మూలం. జ్ఞాన సంపన్నులు దేనికీ భయపడరు – "క్షణం విత్తం క్షణంచిత్తం క్షణం జీవిత మావయోః, యమస్యకరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత" (మన విత్తము,చిత్తము,జీవితము క్షణమాత్రమే. యమునికి దయ లేదు. అందువల్ల జాగ్రత్త) ఇది కేవలం ఆధ్యాత్మిక విషయంకాదు. సంఘసంక్షేమానికి కూడా మేలు చేకూర్చే దృక్పథం. "క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప" అనే గీతావాక్య ప్రేరణతో వివేకానందస్వామి చెప్పిన "Be fearless" అనే నినాదం అందరినీ జాగృతులను చేస్తుంది.

No comments:

Post a Comment